నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల తొలగింపులో స్పష్టత ఇవ్వాలని, అక్రమ నియామకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌కు పిడిఎస్‌యు, పివైఎల్, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ మాట్లాడారు.
యూనివర్సిటీలో అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ రద్దు కోసం జరిగిన ఆందోళనల ఫలితంగా టీచింగ్ నాన్ టీచింగ్ అక్రమ నియామకాలను రద్దుచేస్తూ పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. కానీ ఇప్పటికీ వీటిపై స్పష్టత లేదన్నారు. ఇటీవల జరిగిన హెచ్.ఓ.డిల సమావేశంలో వీసీ రిజిస్ట్రార్లు తొలగించిన పార్ట్ టైం టీచింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అక్రమ నియామకాలను రద్దుచేస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని పార్ట్ టైం లెక్చరర్ల అవసరం ఉన్న శాఖల వారీగా పోస్టులను గుర్తించాలన్నారు. అవసరం మేరకు యూజీసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇకనుంచి యూనివర్సిటీలో ప్రభుత్వ, యూజీసీ నిబంధనల మేరకే నియామకాలు జరగాలని, పరిపాలన పారదర్శకంగా జరగాలని కోరుతున్నామన్నారు.
మళ్లీ అక్రమాలకు తెరలేపితే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల కేంద్రంగా పనిచేయాలని, అకడమిక్ వాతావరణం పెంపొందించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ నాయకులు అశుర్, సాయితేజ, రాకేష్, వెంకట్రాములు, విటల్, ప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.