డిచ్‌పల్లి, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 12, 13 2022 న తెలంగాణ ఏకనామిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు విజయవంతం చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో కాన్ఫరెన్సుకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జరగబోయే సమావేశంలో సంప్రదాయ రాజకీయార్థిక శాస్త్రంలో భాగంగా ఆడం స్మిత్ సిద్ధాంతాలను మొదలుకొని అమర్థ్యాసెన్, అభిజిత్ బెనర్జీ అభివృద్ధి సిద్ధాంతాల వరకు చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అసమానతల కారణాలను సమగ్రంగా చర్చించనున్నారు. తెలంగాణలో విస్తరిస్తున్న పట్టణీకరణ అంశాలను రెండు రోజుల పాటు ప్రఖ్యాత ఆర్థిక వేత్తల సమక్షంలో చర్చించనున్నారు.
బ్రోచర్ రిలీజ్ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య యమ్. యాదగిరి, ప్రిన్సిపాల్ నాగరాజు, ఇసి మెంబర్స్ ఆచార్య నసీం, ఆచార్య రవీందర్ రెడ్డి, లోకల్ సెక్రెటరీ డా. తోకల సంపత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. ఏ. పున్నయ్య, డా. వెంకటేశ్వర్లు, డా. స్వప్న, డా. శ్రీనివాస్, డా. దత్త హరి, పిఆర్‌వో అబ్దుల్ ఖవి తదితరులు పాల్గొన్నారు.