వేల్పూర్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రక్షణలో తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర జవాన్ మహేష్ కుటుంబానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో సంవత్సరం క్రితం ఆయన తన ప్రాణాలను అర్పించిన నేపథ్యంలో ఒక సంవత్సరం పూర్తయినందున సోమవారం ఆయన స్వగ్రామం కొమన్‌పల్లిలో ఆయన విగ్రహ ఆవిష్కరణతో పాటు ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ సంవత్సరం క్రితం ఇదే రోజు ఆయన మన దేశ రక్షణలో తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన గౌరవసూచకంగా బరువెక్కిన హృదయాలతో ఆనాడు కన్నీటితో చివరి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. ఆయనది మామూలు త్యాగం కాదని వెలకట్టలేమని ప్రాణం కంటే ఎక్కువ మనిషికి విలువైనది ఏదీ లేదు అన్నారు.
మనమందరం మన పనులు మనం ప్రశాంతంగా చేసుకుంటున్నాం అంటే మహేష్ లాంటి వీర జవాన్లు అక్కడ బార్డర్లో తమ గుండెల్లో శత్రు తుపాకులకు ఎదురు నిలిచి ఉండటం వల్లే అన్నారు. ఆయనను కన్న తల్లిదండ్రులు, ఆయన భార్య సుహాసిని ధన్య జీవులని, వారికి ఆయన లేని లోటును ఎవరు తీర్చలేనిదని, కానీ ఆ కుటుంబానికి అండగా ఉండవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ముఖ్యంగా తనపై అంతకన్నా ఎక్కువగా ఉందని తాను భావిస్తున్నానని, ముఖ్యమంత్రికి మహేష్ కుటుంబం గురించి వివరించి మహేష్ జీవితం ఏమీ చూడకుండానే దేశం కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి అని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి నిబంధనలు పక్కకు పెట్టి తప్పకుండా ఆదుకుంటామని చెప్పి వెంటనే ఆయన తల్లిదండ్రులు, భార్యకు 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం (మొత్తం 50 లక్షల రూపాయలు), తల్లిదండ్రులకు 300 గజాల ఇంటి స్థలం, భార్యకు హైదరాబాదులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగిందన్నారు.
వీర జవాన్‌కు ప్రభుత్వం తరఫున అందించిన ముఖ్యమంత్రి సహాయానికి అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అమర జవాన్ ర్యాడ మహేష్ గత సంవత్సరం ఇదే రోజు శత్రువులతో పోరాడి ప్రాణాలు వదలడం ఎప్పటికీ మరువలేనిదని, వారి త్యాగాన్ని మాటలతో చేతలతో వెలకట్టలేమని కానీ తప్పకుండా వారి త్యాగాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎండలో చలిలో రాత్రి పగలు మన దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టే మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకోగలుగుతున్నామని, దేశ రక్షణలో శత్రువులు దేశం మీద కన్నెత్తి చూడకూడదనే ఆశయంతో సైనికులు పని చేస్తారని అన్నారు. మహేష్ అడుగుజాడల్లో ఆశలు ఆశయాలకు అనుగుణంగా యువత ప్రజలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని అన్నారు.
అంతకుముందు వేల్పూర్ నుండి కొమన్‌పల్లి వరకు పన్నెండు వందల బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ శ్రీనివాస్, వీర జవాన్ కుటుంబ సభ్యులు, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.