హైదరాబాద్, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ ఏడాది డిసెంబర్ నుంచి తెలంగాణలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. తాజాగా కొత్తవి మంజూరు చేయడంతో ఆ సంఖ్య 2,620కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
వాటిలో గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. ఓపెన్ కేటగిరీ కింద ప్రస్తుతం 1,864 మద్యం దుకాణాలు మిగిలి ఉన్నట్లు తెలిపింది. కొత్తగా పెంచిన మద్యం దుకాణాలకు రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 20న డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.