కామారెడ్డి, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సావిత్రి అనే ఏ.ఎన్.ఎం.పైన వ్యాక్సిన్ ఇచ్చినందుకు భౌతిక దాడి చేసి రక్తం కారే విధంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళితే… రాంపూర్ గడ్డ గ్రామంలో వడ్డే శ్రీలత అనే గర్భిణికి ఈనెల 1వ తేదీన స్థానిక ఏ.ఎన్.ఎం. సావిత్రి కోవిషిల్డ్ వ్యాక్సిన్ మొదట డోసు ఇచ్చారు. కాగా గర్భిణీ శ్రీలత మొదటి కాన్పు నెలలు నిండకముందే అయింది.
డాక్టర్ సూచన ప్రకారం రెండవ కాన్పు కూడా నెలలు నిండకముందే అవుతుందని తెలిపారు. 2వ తేదీ సాయంత్రం ఆమెకు నొప్పులు రావడంతో గాంధారి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం అయింది. ఆడ శిశువు తక్కువ బరువుతో పుట్టింది. (2 కిలోలు) అక్కడ కాన్పు చేసిన డా.ప్రవీణ్ తక్కువ బరువుతో పుట్టడం వలన ప్రమాదకర లక్షణాలు ఉన్నాయి కనుక కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.
అక్కడ 4వ తేదీ ఉదయం శిశువు మరణించింది. ఈ విషయమై ఆమె బంధువులు వ్యాక్సిన్ వల్లనే శిశువు మరణించిందని ఆరోపిస్తూ బూతు పదజాలంతో తిడుతూ భౌతిక దాడి చేసి తీవ్రంగా రక్తం కారే విధంగా ఎఎన్‌ఎంను కొట్టారు. దీంతో ఆరోగ్యశాఖలోని ఏ.ఎన్ ఎం.లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామాలలో ఇంటింటికీ తిరుగుతు వ్యాక్సినేషన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డు లో తిరగడానికి భయపడుతున్నారు.