నిజామాబాద్, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రవర్తనా నియమావళి తప్పకుండా పాటించాలని, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి పొందాలని, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి తెలిపారు.
డిసెంబర్ 10న జరిగే స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని, 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 24న పరిశీలన ఉంటుందని, 26 వరకు ఉపసంహరణ ఉంటుందని, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ ఉంటుందని డిసెంబర్ 16న ఎలక్షన్ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ సమయం ఉన్నదని ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్ జిల్లాలోని మూడు డివిజన్లు కామారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలో కలిపి ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ దిశగా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం రెండు జిల్లాలలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు కలిపి 824 మంది ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్‌కు పంపించడం జరిగిందని ఇంకా ఎవరైనా సభ్యులు జాబితాలు లేకుంటే వారు దరఖాస్తు చేసుకుంటే 7 రోజులలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
రాజకీయ పార్టీలు కానీ పోటీ చేసే అభ్యర్థులు కానీ ప్రచారానికి సంబంధించి సంబంధిత ఆర్డీవోలకు ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సూచించారు.
ఈ ఎన్నిక సందర్భంగా ర్యాలీలకు అనుమతి లేదని అయితే ఇండోర్ సమావేశాలకు 200 అవుట్‌డోర్ సమావేశాలకు వెయ్యి మందికి మించకుండా ముందస్తు అనుమతితో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రాజకీయ పరమైన ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఫోటోలు, గోడలపై రాతలు అన్ని ప్రభుత్వ స్థలాలలో, సంస్థలలో తొలగించవలసిందిగా సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందని తెలిపారు.
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికి కలెక్టరేట్‌లో డిపిఆర్‌ఓ ఆధ్వర్యంలో ఎంసి ఎంసి కమిటీకి దరఖాస్తు చేసుకొని అనుమతి వచ్చిన తర్వాతనే ప్రచారం చేసుకోవాలని ప్రింట్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి ప్రచురణ తర్వాత వివరాలు సమర్పించాలని వివరించారు. నోటిఫికేషన్ జారీ కాగానే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎమ్‌సిసి పకడ్బందీగా అమలు జరపడానికి ప్లయింగ్ స్క్వార్డ్స్, చెక్ పోస్ట్‌లు తదితర కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల విధుల ద్వారా ప్రజలతో కలిసే అవకాశమున్న ఉద్యోగులు, అధికారులు, రాజకీయ పార్టీల వారు, ఏజెంట్లు తప్పనిసరిగా రెండు విడతల వ్యాక్సినేషన్ చేసుకున్నవారు ఉండేవిధంగా ఇటు జిల్లా యంత్రాంగం, అటు రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని వారికే విధులు అప్పగించాలని స్పష్టం చేశారు. గతంలో లాగే ఈ ఎన్నిక కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా మీడియా తమ పూర్తి సహకారం అందించాలని అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు సిపి అరవింద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.