నిజామాబాద్, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ పి.డి.ఎస్.యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్, విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరుగుతున్నాయన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి అమరవీరుల పోరాట త్యాగాల స్ఫూర్తితో రాజీలేని పోరుచేస్తున్నదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, జాతీయ నూతన విద్యా విధానం, ప్రైవేటు యూనివర్సిటీలు, పాఠశాలల మూసివేత, ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టుల భర్తీ తదితర సమస్యలపై శిక్షణా తరగతులు నిర్వహించి, భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.
పిడిఎస్‌యు విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ని జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం. నరేందర్, ఎం.ప్రశాంత్, జె. రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శులు కార్తీక్, సంతోష్ జిల్లా నాయకులు ప్రశాంత్, సుజిత్, దుర్గాప్రసాద్, అనిల్, సాయికృష్ణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.