కామారెడ్డి, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ఫోటోలు లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి డివిజన్‌లో పోలింగ్ స్టేషన్ భవనాలలో సౌకర్యాలు ఉండేవిధంగా చూడాలన్నారు.
ఉమ్మడి జిల్లా సరిహద్దులలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదని పేర్కొన్నారు. అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలలో ఐదు వందల కంటే ఎక్కువ ప్రజలు హాజరు కావద్దని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ నవంబర్ 16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని చెప్పారు. డిసెంబర్ 10 న పోలింగ్, 14న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. డివిజన్ స్థాయిలో ఆర్‌డివోలు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్వేత, నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.