కామారెడ్డి, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కుల రక్షణ, సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు.
సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి విద్యను నేర్చుకోవాలని కోరారు. లక్ష్యాలను ఎంచుకొని దానికి అనుగుణంగా సాధన చేయాలని పేర్కొన్నారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటి కార్యదర్శి విక్రం మాట్లాడారు. బాలలకు అందవలసిన హక్కులపై అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నప్పటినుంచే బాలలకు తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యతలను తెలియజేయాలని కోరారు. పిల్లలను చూస్తే తనకు బాల్యం జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడారు.
బాలల రక్షణకు అండగా నిలవాలని సూచించారు. పట్టుదలతో చదివి చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కరోనా కారణంగా గత ఏడాది బాలల దినోత్సవాన్ని నిర్వహించలేక పోయామని చెప్పారు. బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా గత ఏడాది కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.
చిన్నారులలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి అంగన్‌వాడి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బెలూన్లను ఆవిష్కరించారు. గోడ పత్రికపై ఉన్న ఆడపిల్లలను రక్షిద్దాం.. ఆడపిల్లలను చదివిద్దాం అనే అంశంపై సంతకం చేశారు. చిన్నారులు దేశనాయకుల వేషధారణలో వచ్చిన వారిని అభినందించారు. ఈ సందర్బంగా నాగిరెడ్డిపేట కస్తూరిబా విద్యార్థులు, రెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. చైల్డ్ లైన్ 1098 వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. కరోనా సమయంలో సేవలందించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా ఎస్సీ వసతిగృహాల సంక్షేమ అధికారి రజిత, జిల్లా పిల్లల రక్షణ కమిటీ సభ్యురాలు స్వర్ణలత, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ జానకి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, చైల్డ్ లైన్ 1098 జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అమృత రాజేందర్, సిడిపిఓలు శ్రీలత, రోచిష్మ, పారిజాతం, అనురాధ, సునంద, చైల్డ్ లైన్, బాల రక్ష భవన్ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.