నిజామాబాద్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిడిఎస్‌యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 12,13,14 తేదీల్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులతో విజయవంతంగా జరిగినట్టు పిడిఎస్‌యు ప్రతినిధులు పేర్కొన్నారు.
జనరల్ కౌన్సిల్‌లో పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ జిల్లానుండి ముగ్గురికి ప్రాతినిద్యం లభించిందని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కామ్రేడ్ కల్పన రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారని, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న నరేందర్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారని వివరించారు.
అదేవిధంగా యూనివర్సిటీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా జే.రాజేశ్వర్, ఎం.సుజిత్ కుమార్‌లు ఎన్నికైనట్టు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాల రద్దు, యూజీసీ నిబంధనల మేరకు టీచింగ్ పోస్టుల భర్తీ, యూనివర్సిటీలో పారదర్శక పాలన కోసం మరింత ఉత్సాహంగా ఉద్యమిస్తామన్నారు. యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామన్నారు.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కులకోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యం చేస్తామని, పిడిఎస్‌యు జిల్లా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.