కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బావరి సావిత్రి (42) కామారెడ్డి నివాసురాలు పోతంగల్ సబ్ సెంటర్, గాంధారి మండలం నందు ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏఎన్‌ఎం, వైద్య శాఖ అధికారుల ద్వారా అందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈనెల ఒకటవ తేదీన రాంపూర్ గడ్డ గాంధారి మండలానికి చెందిన వడ్డే శ్రీలత (22) కి మొదటి డోసు వ్యాక్సిన్ వేయడం జరిగినది. అయితే మరుసటి రోజు శ్రీలతకు ఏడవనెల పురిటి నొప్పులు రావడంతో గాంధారి ప్రభుత్వ దవాఖానలో పాపకు జన్మనిచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
పాప తక్కువ బరువు, మిగతా అనారోగ్య కారణాల రీత్యా మెరుగైన చికిత్స కొరకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తదుపరి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికిని పాప చనిపోయింది. ఈ విషయంలో పాప చనిపోవడానికి కారణం ఏఎన్‌ఎం అని, శ్రీలతకు వ్యాక్సిన్ వేయడమే అని శ్రీలత ఏఎన్‌ఎంకి ఈనెల 9న ఫోన్ చేసి భయపెట్టడం, విపరీతమైన బూతు మాటలు తిట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా తర్వాత రోజు ఏఎన్‌ఎం పద్మాజివాడి చౌరస్తా వద్ద డ్యూటీలో ఉండగా శ్రీలత, శ్రీనివాస్ (శ్రీలత భర్త), సావిత్రి, ఏ లక్ష్మీ బాయి (శ్రీలత తల్లి) ముగ్గురూ కలిసి ఏఎన్‌ఎం వద్దకు వెళ్లి దాడి చేశారు. ఇట్టి విషయంలో ఏఎన్‌ఎం ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి సోమవారం శ్రీనివాస్, సాయవ్వను అరెస్టు చేసినట్టు తెలిపారు.
అదేవిధంగా సోమవారం ఎంఆర్‌వో, ఎస్‌ఐ వివిధ మండల అధికారుల ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ ఏఎన్‌ఎంలకు ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఇకపై ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.