కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 17, 18 తేదీలలో పోడు వ్యవసాయంపై గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు.
గాంధారిలో 475 మంది అటవీ భూములను ఆక్రమించినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికి 135 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ లో 2,163 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు 40 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. లింగంపేటలో 442 మంది ఉన్నారని ఇంతవరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయికి వెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించి దరఖాస్తులు చేసుకునే విధంగా చూడాలని కోరారు. హ్యాబిటేషన్‌ల వారీగా దరఖాస్తులు స్వీకరించాలని లబ్ధిదారులకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.