హైదరాబాద్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు.
సోమవారం అగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని సంచాలకులు వివరించారు. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సుమారు 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందన్నారు. అల్పపీడనం ఇంచుమించు పశ్చిమదిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరం వద్ద దానిని అనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈనెల 18న చేరే అవకాశం ఉందని తెలిపారు.