కామారెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్‌లో రూర్బన్ పథకం కింద 6.45 కోట్ల రూపాయలతో పది ధాన్యం నిల్వ గోదాములను నిర్మించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పది గోదాములలో 8150 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.
14 వేల 296 మంది రైతుల ధాన్యం నిల్వ చేసుకునే విధంగా గోదాముల నిర్మాణం పూర్తి చేశారని పేర్కొన్నారు. రూ.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మించినట్లు చెప్పారు. మార్చి 2022 వరకు పురోగతిలో ఉన్న 80 పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 363 పనులకు గాను రెండు వందల ఎనభై మూడు పనులు పూర్తయినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, రూర్బన్ డిపిఎం వినోద్ పాల్గొన్నారు.