కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. జియో, రిలయన్స్ ఫౌండేషన్, టాటా స్కై, హెచ్‌డీఏఫ్‌సీ జనరల్ ఇన్సూరెన్సుకు సంబందించి వేర్వేరుగా జాబ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతీ, యువకులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేట్ రంగంలోనూ మంచి వేతనాలు ప్రభుత్వ రంగంతో సమానంగా ఇచ్చే సంస్థలు ఉన్నాయన్నారు. కష్టపడే తత్వంతో మంచి నైపుణ్య అవగాహన కలిగి ఉంటే ప్రైవేటు రంగంలోనూ అద్భుతంగా రాణించవచ్చని సూచించారు.
డిగ్రీ, పీజీలు చేసి ఖాళీగా ఉండకుండా మంచి నైపుణ్యాభివృద్దితో ముందుకెళ్లాలని కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూనే ప్రైవేటులోనూ ప్రతిభ చాటాలన్నారు. అందులో భాగంగా కళాశాల ఆద్వర్యంలో వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళా నిర్వహించామని, భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరుకావడం వారి ఉత్సాహాన్ని ఆయన అభినందించారు.
ఒకవేళ మరిన్ని పెద్ద సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని, యువతీ యువకులు ఎటువంటి నైరాశ్యానికి గురికావద్దన్నారు. కాగా జియో, రిలయన్స్ ఫౌండేషన్ లో 40మంది విద్యార్థినులు ఎంపికయ్యారని, టాటా స్కై ఉద్యోగాలకు 80 మంది యువకులు ఎంపికయ్యారని, హెచ్‌డీ ఎఫ్‌సీ జనరల్ బ్యాంకు ఇన్సూరెన్స్ ఉద్యోగాలకు వంద మందిని ఆయా సంస్థలు నియమించుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల యాజమాన్యాలతో పాటు కళాశాల బృందం స్వామిగౌడ్, సురేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.