నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు స్వీట్లు పంచి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఏఐకెఎస్‌సిసి జిల్లా బాధ్యులు వి. ప్రభాకర్ మాట్లాడుతూ చలిని, ఎండలను, వానలను ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ సంవత్సర కాలంగా ఢల్లీి సరిహద్దుల్లో పోరాడుతున్న రైతుల పోరాటానికి మోడీ ప్రభుత్వం తలవొగ్గి మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు అంగీకరించడం రైతుల ప్రతిఘటన పోరాట విజయమన్నారు.
రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోదీ వెనక్కు తగ్గడం జరిగిందని, అంతేగాని మోదీ తన కార్పొరేటీకరణ అనుకూల విధానాలను వదులుకోలేదన్న విషయం మరువరాదన్నారు. విద్యుత్ బిల్లును ఉపసహరించలేదని, పంటలకు గిట్టుబాటు ధరలు చట్టబద్దత కల్పించే హామీ లేదని గుర్తు చేశారు. అందుకే అవి రద్దుచేసి వరకు రైతు పోరాటం కొనసాగుతుందన్నారు.
రైతు ఉద్యమ విజయం పోరాట స్పూర్తితో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లకు, సీఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలకు, ఉపా వంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, న్యూడెమోక్రసీ నాయకులు భాస్కర్, జేఏసీ కన్వీనర్ భాస్కర్, పాపన్న, దేవారం, రాజన్న, గంగాధర్, భూమన్న, సాయగౌడ్, వెంకన్న, సుధాకర్, శివ కుమార్, రవి, రాజేశ్వర్, అశుర్, సాయికృష్ణ, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.