నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని గురువారం హైదరాబాద్‌లో కమీషనర్ నవీన్ మిట్టల్‌కి పి.డి.ఎస్.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు నరేందర్ మాట్లాడుతూ టీచింగ్, నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు.
ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన పార్ట్ టైమ్ టీచర్లను తొలగించారన్నారు. కానీ సౌత్ క్యాంపస్ ఫిజిక్స్ విభాగంలో అక్రమ పద్ధతిలో ముగ్గురు పార్ట్ టైం లెక్చరర్లుగా నియామకమై, మళ్లీ తప్పుడు పద్ధతిలో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌కు సంబంధం లేకుండా, వారిని అకడమిక్ కన్సల్టెంట్లు మార్చారన్నారు. ఫిజిక్స్ డిపార్టుమెంటుకు సంబంధం లేకుండానే రెండున్నర సంవత్సరాలుగా వీరికి అకడమిక్ కన్సల్టెంట్స్‌గా వేతనాలు వస్తున్నాయన్నారు.
ఇది యూనివర్సిటీ డబ్బులను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. అక్రమ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. వీసీ, రిజిస్ట్రార్‌లు పాలక మండలిని, కమిషనర్‌ను తప్పుదోవ పట్టించడం మానుకోవాలన్నారు. యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, జిల్లా అధ్యక్షుడు కిషన్, పీ.డీ.ఎస్.యూ నాయకులు అశుర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.