నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెన్షనర్లు ఎదుర్కొంటున్నసమస్యలు పరిష్కరించాలని, నవంబర్ 26 హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. గురువారం పెన్షనర్ల సంఘం వినాయక్ నగర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శాస్త్రుల దత్తాత్రేయ రావు మాట్లాడారు.
పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండిరగు డి .ఏ లను విడుదల చేయాలని, జూలై 2018 తర్వాత రిటైరయిన వారందరికీ పెరిగిన గ్రాట్యుటీ ఇతర ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని, పిఆర్సి సిఫార్సులపై జీవోలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్‌రావు మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని, దీనికి ఉదాహరణ అనేక సమస్యలు పెండిరగ్‌లో ఉన్నాయని తక్షణమే పెన్షనర్స్ సంఘాలతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ స్వామి, జార్జి, ఈవిఎల్ నారాయణ, లావు వీరయ్య, సుదర్శన్ రాజు, జిందా నరహరి, అహ్మద్ బేగ్, పండరీ తదితరులు పాల్గొన్నారు.