కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై మండల స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహించారు.
శిక్షణకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా ప్రణాళిక బద్దంగా శ్రమశక్తి సంఘాల ద్వారా పనులను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో రెండు వందల అరవై పనులు ఉన్నాయని చెప్పారు. కూలీలకు ఉపాధితోపాటు శాశ్వతంగా ఆదాయం పొందే విధంగా చూడాలన్నారు.
గేదెల, గొర్రెల షెడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడి కేంద్రాల సమీపంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు త్వరిత గతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శ్రమ్ ద్వారా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకుని అర్హతగల వారందరికీ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
పని చేసిన చోట వర్క్ సైడ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రికార్డులు సజావుగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానికసంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఉపాధి హామీ ఏపిడి శ్రీకాంత్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈసిలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.