బాల్కొండ, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనకు స్వాతంత్య్ర దినోత్సవం తెలుసు… గణతంత్ర దినోత్సవం తెలుసు… మరి రాజ్యాంగ దినోత్సవం ఏంటి.. ఎందుకు జరుపుతారో తెలుసుకుందామనీ విద్యార్థులనుద్దేశించి బాల్కొండ మండల విద్యాశాఖాధికారి రాజేశ్వర్ అన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 26న మనదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోందని, దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారన్నారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారని, 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందన్నారు. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ… రాజ్యాంగాన్ని స్వీకరించిందని, ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
అయితే ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో… దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదనీ, రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేకంగా 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 11న ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారని గుర్తుచేశారు. 2021లో అంబేద్కర్ 131వ జయంతి జరిగిందని, భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారని, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఇది వరకు నవంబర్ 26న లా డేగా జరుపుకునేవారన్నారు.
నవంబర్ 26న రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసిందని, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారన్నారు. ఆ కమిటీ ఏడాది పాటూ ఉత్సవాలు నిర్వహించిందని, అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారన్నారు. ఆ క్రమంలో 2015 అక్టోబర్‌లో ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునాది రాయి వేస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారన్నారు.
అలా 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుగుతోందని, పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని, తన జీవితాన్ని ధారపోశారన్నారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని, చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదని, అందువల్ల ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను నవంబర్ 26న విద్యర్థులు, ప్రజలకు తెలిసేలా స్కూళ్లలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాజ్యాంగ నిర్మాతగా ఆయనే నవంబర్ 26న పాఠశాలలో రాజ్యాంగంపై ప్రసంగాలు, డిబేట్లు నిర్వహిస్తారన్నారు. అలాగే మాక్ పార్లమెంట్ వంటివి కూడా జరుపుతారని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచుతారన్నారు. సమాజం పట్ల వారిలో సేవానిరతిని పెంపొందించడం జరుగుతుందనీ మండల విద్యాధికారి రాజేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్ రామ్ రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తధితరులు పాల్గొన్నారు.