నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం సేకరణ 80 శాతం పైగా దాటినందున మరో రెండు రోజుల్లో మిగతా ప్రక్రియను పూర్తి చేసి రైతులకు బిల్లులు చెల్లించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని, కడ్తా అడగని మిల్లులకే ధాన్యాన్ని పంపించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ నుండి ఆయన ధాన్యం సేకరణ సంబంధించిన అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేకరణ చివరి దశకు చేరిందని ఇప్పటివరకు 80 శాతం పైగా పూర్తిచేశామని మరొక 15 నుండి 20 శాతం మాత్రమే మిగిలి ఉందని 5.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని కొంచెం అటు ఇటుగా మరో లక్ష టన్నులు ఉన్నందున రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
తద్వారా సోమవారం నాటికి 95 శాతం కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఇంకా ధాన్యం రావాల్సి ఉన్న కేంద్రాలను మాత్రం ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ఇందుకుగాను గ్రౌండ్ లెవెల్‌లో బ్యాలెన్స్ రిపోర్టు తెప్పించుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కడ్తా అడగకుండా ధాన్యం తీసుకోవడానికి మిల్లులు సిద్ధంగా ఉన్నాయని అందువల్ల కడ్తా అడగని మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని ఆయన అధికారులకు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ధాన్యాన్ని అందించిన రైతులకు త్వరగా బిల్లులు చెల్లించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలు అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సెల్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిసిఓ సింహాచలం, డిఆర్‌డిఓ చందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.