గాంధారి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుండెపోటుతో వచ్చిన రోగికి వైద్యం చేస్తున్న డాక్టర్‌కు గుండెపోటు వచ్చిన సంఘటన ఆదివారం గాంధారి మండలంలో చోటుచేసుకుంది. అయితే ఇందులో రోగితో పాటు డాక్టర్ కూడా గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం అలుముకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన బజ్యా నాయక్ (48) కు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ రోగికి డాక్టర్ లక్ష్మణ్ చికిత్స అందించే క్రమంలో హటాత్తుగా ఆయనకు కూడా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ సిబ్బంది ఆయనకు వైద్యం అందిస్తుండగానే ఆయన కన్నుమూశారు.
ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతున్న పేషంట్‌ను ఆయన బంధువులు కామారెడ్డికి అబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒకేసారి అటు పేషంట్ ఇటు వైద్యుడు గుండెపోటుతో మృతి చెందడంతో వారి వారి కుటుంబ సభ్యులకు షాక్‌కి గురైయ్యారు. కాగా డాక్టర్ లక్ష్మణ్ నిజామాబాదు జిల్లా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ గాంధారిలో ప్రైవేట్ క్లినిక్ నడుపుకుంటున్నాడు. డాక్టర్ లక్ష్మణ్‌కు ఇదివరకే ఒకసారి గుండెపోటు రాగా అతనికి ఒక స్టంట్ వేసినట్టు బంధువులు తెలిపారు.