కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం 100 శాతం ప్రయత్నం చేయాలని సూచించారు. ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.
అన్ని సబ్జెక్టులలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రజిత మాట్లాడుతూ కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా వసతి గృహంలో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, పాటలు, ఇతర అంశాలు నేర్పిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థినిలకు దుప్పట్లు, బ్యాగులు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అంతకుముందు వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, వసతి గృహ సంక్షేమాధికారిని సరిత, విద్యార్థినిలు పాల్గొన్నారు.