కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాహాత్మాజ్యోతిభాఫూలే ఆశయాలకు అనుగుణంగా సమాజం కోసం ఉద్యమిస్తామని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు గడ్డం సంపత్ అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిభాఫూలే 131వ వర్దంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన భారతదేశంలో ఉన్న తీవ్రమైన మూడవిశ్వాసాలు, సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తు చేశారు. మహిళల కోసం ఆనాడే తీవ్రంగా కొట్లాడారని గుర్తు చేశారు. మూఢ విశ్వాసాల పేరిట అక్షరాలకు, జ్ఞానానికి దూరం చేస్తూ బాల్య వివాహలతో మహిళల జీవితాలు నాశనం కాకుండా గొప్ప సంస్కరణ ఉద్యమాన్ని చేశారన్నారు.
సమాజాభివృద్ది కావాలంటే విద్య చాలా అవసరమని అందులోనూ మహిళలకు చదువు మరింతో ముఖ్యమని పాఠశాలలు ప్రారంభించారన్నారు. ఆయన ఆశయాలు, సమాజం కోసం ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదులుతామని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టియు టీఎస్ అద్యక్షులు అంబీర్ మనోహర్ రావు, బీసీ విద్యార్థి నాయకుడు హరీష్, శ్రీను, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.