బోధన్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుతం కొనసాగిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు 4, 5 కిలోలు కావాలని రైస్ మిల్లు యజమానులు బెదిరించడం మానుకోవాలని యాసంగిలో వరి కొనుగోలు చేయుటకు గురించి ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన ప్రత్యామ్నాయ పంటల సాగు చేయుట గురించి సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్.డి.ఓ కార్యాలయం ముందు సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ, ఐ.ఎఫ్.టీ.యూ, ఏ.ఐ.కే.ఎం.ఎస్, పీ.డీ.ఎస్.యూల ఆధ్వర్యంలో ధర్నా చేసి ఆర్‌డీవోకి మెమోరాండం అందజేశారు.
ఈ సందర్బంగా ఎఫ్.టీ.యూ సి.పి.ఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ గత 15, 20 రోజులుగా యాసంగిలో వరి సాగు చేయరాదని, సాగు చేయాలని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్న అధికార పార్టీలు ఆందోళన చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటూ రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని ముఖ్యంగా యాసంగిలో వరిని సాగు చేయరాదని వరి పంట వేస్తే ‘ఉరే’ అని కేసీఆర్ ప్రకటన చేసి రైతులను ఆందోళనకు గురి చేశారని ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వరి కొనాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వరి కొనుగోలు చేయరాదని చెప్పలేదని డంకా బజాయించి ప్రచారం చేశారని ఈ ఇద్దరు లొల్లి రైతులను గందరగోళం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
ఆకస్మికంగా యాసంగిలో వరి సాగు చేయరాదని హెచ్చరికలు చేయడం, విత్తన వ్యాపారులను ఫర్టిలైజర్ వ్యాపారులను బెదిరించి వరి విత్తనాలను అమ్మకుండా అడ్డుకోవడం వల్ల వరి సాగు తగ్గుతుందని నమ్మడం అశాస్త్రీయం అవుతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తి సంఘాలను, ఆ రంగంలో పనిచేస్తున్న రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నింటినీ భాగస్వామ్యం చేస్తూ ప్రత్యామ్నాయ పంటలపై ప్రచారం చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో గల చక్కెర ఫ్యాక్టరీలు మెదక్, జహిరాబాద్, బోధన్, ముత్యంపేట, ఎన్‌సిఎస్‌ఎఫ్ సారంగాపూర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని, రైతులకు చెరకు విత్తనాన్ని ఉచితంగా ఇచ్చి రైతులకు పెట్టుబడి బ్యాంకుల ద్వారా ఇప్పించాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు మద్దతు ధర గ్యారంటీ ఇచ్చే విధంగా వీరికి విత్తనాలు సహకార సంఘం ద్వారా ఉచితంగా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని యాసంగిలో వరి కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో గల రైతు సహకార సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అవకాశం కల్పించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కె. రవి, బి. నాగమణి, మౌనిక, గంగారాం, రజాక్, చింతం గంగారాం, ప్రభాకర్, సూర్యకాంత్ లింగం, చందు తదితరులు పాల్గొన్నారు.