నిజామాబాద్, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు తెలియజేస్తున్నాయని అది ఇంతకు ముందటి 1, 2 విడతల వైరస్ కంటే కూడా ఎన్నో రెట్లు ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారని దీని నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒకటే మన ప్రాణాలను కాపాడుతుందని అందువల్ల ఇంకా వ్యాక్సిన్ తీసుకోని లక్షన్నర మంది వెంటనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవాలని ఇందు గురించి నేను మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నానని ఒక మెసేజ్ ద్వారా జిల్లా ప్రజలను కలెక్టర్ నారాయణ రెడ్డి వేడుకున్నారు.
బుధవారం తన ఛాంబర్ ద్వారా ఆయన జిల్లా ప్రజలకు మెసేజ్ అందజేస్తూ మొదటి విడత కరోనా వైరస్ కొంతమేరకే ఇన్ఫెక్షన్ కలిగించిందని రెండో విడతలో చాలా ఇబ్బందులు పడ్డామని ఎన్నో కుటుంబాలు వారి ఆప్తులను కోల్పోయారని మూడవ విడత ప్రారంభమైందని చెబుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరెంతో ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు అని జాగ్రత్తలు తీసుకోకుంటే వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు.
ముఖ్యంగా కొన్ని అపోహలతో అనుమానాలతో భయంతో జిల్లాలో 14 శాతం మంది అనగా లక్షన్నర ప్రజలు ఇంకా మొదటి విడత వ్యాక్సిన్ తీసుకోలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకొని ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా చక్కగా ఉన్నారని కావున అపోహలను విడనాడి మిగతా వారంతా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కుల పెద్దలు, మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఇంకా తీసుకోని ప్రజలకు అవగాహన కల్పించి వారంతా కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా చైతన్యవంతులను చేయాలని ఆయన కోరారు.
రెండు విడతల వ్యాక్సిన్ తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరిగి ఒకవేళ మూడవ విడత వైరస్ వచ్చినప్పటికీ చిన్నపాటి సమస్యలతో ప్రాణాలతో బయటపడగలుగుతారని లేదంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని తద్వారా కుటుంబ సభ్యులకు శోకాన్ని బాధను మిగుల్చుతారని, రెండవ విడతలోనే ఇలా ఎన్నో ఫ్యామిలీలను మనం చూశామని ఆయన పేర్కొన్నారు.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రెండు విడతల వ్యాక్సినేషన్ తీసుకొని ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకొని కుటుంబ సభ్యులకు సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు.