నిజామాబాద్, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ చివరికల్లా రాష్ట్రంలో రెండు విడుదల వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయడంతోపాటు ఓమైక్రాన్ గురించి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు టి హరీష్ రావు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
కరోనా వ్యాక్సినేషన్, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై ఆయన ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, మున్సిపల్ చైర్ పర్సన్‌లు తదితర శాఖల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వాక్సినేషన్ అందించడంతోపాటు ఒమైక్రాన్‌ను గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎదుర్కొనే విధంగా ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, ఈ దిశగా ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకొనుటకు ఆదేశించారని తెలిపారు. ఈ దిశలో ముఖ్యంగా ప్రజలు వ్యాక్సినేషన్ రెండు విడతల తీసుకోవడంతోపాటు తప్పనిసరిగా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం చేతులు శుభ్రం చేసుకోవడం కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం ద్వారా దీని నుండి బయటపడడానికి వీలవుతుందన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం మొదటి విడత 46 శాతం రెండో విడత వ్యాక్సినేషన్ పూర్తిచేశామని, రెండు విడతలు కూడా నూటికి నూరు శాతం డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. అందరు ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, మున్సిపల్ చైర్ పర్సన్‌లు ఈ దిశగా భాగస్వాములై ప్రతి ఒక్కరికి రెండు విడుతల వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. జూనియర్ కాలేజ్ స్థాయి నుండి ఆపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించడంతో పాటు వారి ద్వారా వారి తల్లిదండ్రులు కూడా వ్యాక్సిన్ చేయించుకునే విధంగా చూడాలని ఆయన అన్నారు.
కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మనమంతా మొదటి, రెండవ దశల వైరస్ చూశామని ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న అనుభవాన్ని గడిరచామని ఆ అనుభవంతో ప్రజలందరూ ఒమైక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్లు తీసుకోవడంలో వైరస్ విషయంలో ప్రజలలో గల అపోహలను అనుమానాలను నివృత్తి చేయడానికి మీడియాను సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని, ప్రతిరోజు ఈ వార్తలకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు తెలిసే విధంగా పలురకాల ప్రచారాలు నిర్వహించాలని అధికారులను కోరారు.
రెండవ విడతలో ఎంతోమంది కేవలం భయంతోనే ప్రాణాలు వదిలారని అలాంటి భయాలు లేకుండా ధైర్యంగా ఉండేవిధంగా ప్రజలకు తెలియ చేయవలసిన అవసరం ఉందన్నారు. చికిత్స అందించే ఆసుపత్రులు ఖాళీగా ఉన్న బెడ్స్ ఇతర వివరాలను ప్రతిరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామాల మధ్య మండలాలు మున్సిపాలిటీల మధ్య పోటీతత్వం ఏర్పడాలని తద్వారా ప్రజలు ముందుకు వచ్చే స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడాలన్నారు.
మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థల్లోని 95 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, 50 శాతం విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకున్నారని గురుకులాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.
వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిఎంహెచ్‌వో సుదర్శనం, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ, డిఆర్‌డిఓ చందర్ నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతి మారాజ్, డిపిఓ జయసుధ, డిఈఓ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.