నిజామాబాద్, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థుల వద్ద డెవలప్‌మెంట్ ఫీజుల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ విద్యార్థులకు డెవలప్‌మెంట్ ఫీజు పేరుతో ప్రతి విద్యార్థి వద్ద వెయ్యి రూపాయలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ కళాశాలలే విద్యార్థుల వద్ద డెవలప్‌మెంట్ ఫీజులు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికే కోవిడ్, అనంతర పరిణామాలతో మెజారిటీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు మెజారిటీ పేద, మధ్యతరగతి విద్యార్థులే ఉంటారన్నారు. వీరందరూ డెవలప్‌మెంట్ ఫీజు కట్టడం అంటే తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ప్రభుత్వ కాలేజీలో డెవలప్‌మెంట్ ఫీజులు వసూలు చేస్తే, ప్రైవేట్ కాలేజీలు మరింత ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతాయన్నారు. ఈ విషయమై త్వరలోనే సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌కి వినతి పత్రం ఇస్తామన్నారు.
ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థుల కాలేజీ ఫీజు, ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని ఉన్నత సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నగర నాయకులు అశుర్, మహిపాల్, నవీన్, గంగాజల, ప్రసన్న, మహేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.