నిజామాబాద్, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వడ్లను కొనే అవకాశం లేనందున వరికి బదులు రైతులు పంట మార్పిడి ద్వారా ఏ పంటలు సాగు చేయాలో వివరించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, కె.వి.కె. శాస్త్రజ్ఞులు, రైస్ మిల్లర్లు, రైతుబంధు ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వరి ధాన్యాన్ని కొనే అవకాశాలు లేవని చర్చ జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు పండిస్తే లాభసాటిగా ఉంటుందో పండిరచే విధానాలు ఏమిటో అందుకు ఏర్పాటు చేయవలసిన సదుపాయాలు ఏమిటో శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు రైతు వేదికల ద్వారా శనివారం నుండి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వివరాలను రైతులకు అర్థమయ్యే తీరుగా సూచించాలని పేర్కొన్నారు.
ఇందుకై శాస్త్రవేత్తలు, నిపుణులు వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం వర్క్ షాప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా రైతులు వ్యవసాయరంగంలో రాష్ట్రంలో ఎంతో చైతన్యవంతంగా ఉంటూ వరితో పాటు పసుపు, సోయా మరెన్నో పంటలను సాగుచేస్తూ విత్తనాలను కూడా తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నారని తెలిపారు.
పుష్కలంగా నీటివసతి, 24 గంటల విద్యుత్తు, అవసరాలకు అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచడం వల్ల ఈ వాన కాలంలో 3.87 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని తద్వారా 7.87 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట దిగుబడి వచ్చిందని తెలిపారు. యాసంగి పంట ద్వారా బాయిల్డ్ రైస్ కొనే అవకాశం లేదని చర్చ జరుగుతున్న నేపథ్యంలో రైతులు మళ్ళీ వరి పంటలు సాగు చేసి ఇబ్బందులకు గురి కాకుండా వారిని ముందుగానే ఇతర లాభదాయకమైన పంటల వైపు మళ్లీంచవలసిన అవసరం ఉన్నదని అందుకు అనుగుణంగా వారిని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందో, దిగుబడి బాగా వస్తుందో వచ్చే లాభాలు ఏంటో, మార్కెట్‌లో డిమాండ్ ఏ విధంగా ఉన్నదో వారికి అర్థమయ్యే రీతిగా చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై రైతు వేదికల ద్వారా అర్థవంతమైన చర్చ జరగాలని ప్రతిరోజు ఒక క్లస్టర్‌ను ఎంపిక చేసుకొని మన భూములకు, వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటల గురించి రైతులకు అన్ని వివరాలు తెలియచేసి వారు పంటల మార్పిడి దిశగా వెళ్లే విధంగా సూచించాలన్నారు.
పంటల మార్పిడికి శాస్త్రీయ కారణాలున్నాయి, వాజిద్ హుస్సేన్, ఏడిఏ
ఎప్పుడూ ఒకే పంట సాగు చేయడం వల్ల భూమి సారం కోల్పోతుందని, నేలలు చవిడి నేలలుగా మారుతాయని, అందువల్ల పంటల మార్పిడికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయని తప్పనిసరిగా అన్ని భూముల్లో పంటల మార్పిడి జరిగితేనే భూములు సారవంతంగా ఉంటాయని, కొన్ని నష్ట కారక క్రిములు కూడా నశిస్తాయని తెలిపారు.
ప్రస్తుతం మొక్కజొన్న, కదిరి రకం వేరుశనగ, కూరగాయలు సాగు చేయవచ్చు, డా. నవీన్ శాస్త్రవేత్త
డిసెంబర్ నెల ప్రారంభం అయ్యింది కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి మొక్కజొన్న వేయవచ్చని అదేవిధంగా కదిరి రకం వేరుశనగ సాగు చేస్తే బాగుంటుందని వరి సన్నాలు ఈ నెలలో ప్రారంభించి ఏప్రిల్ 15లోగా కోస్తే ప్రకృతి వైపరీత్యాలు రాకపోవచ్చని నూక కూడా తక్కువ వస్తుందని వివరించారు. కూరగాయలకు కూడా మంచి అవకాశం ఉన్నదన్నారు.
చెరువుల కింది భాగంలో చేపల పెంపకం ఎంతో లాభదాయకం, స్వామి, సహాయ సంచాలకులు, మత్స్యశాఖ
చెరువుల కింద ఉండే భూముల్లో ఎక్కువగా నీరు వచ్చే చోట 6, 7 మీటర్ల లోతులో గుంతలు తీసి చేపల పెంపకం చేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయని కిలో చేపను పెంచడానికి 30 రూపాయలు ఖర్చయితే దానిని విక్రయించడం ద్వారా 120 రూపాయలు వస్తుందని పేర్కొన్నారు.
పందిరి కూరగాయలు, పూలు, సీతాఫలం తదితర సాగు వల్ల మంచి లాభాలు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు నర్సింగ్ దాస్
పంట మార్పిడి వల్ల భూమికి మంచిదని కొన్ని రకాల కీటకాలు నశిస్తాయి అని తీగ జాతి కూరగాయలతో పాటు దుంప పంటలైన బీట్రూట్, ఆలు, క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంపల సాగు వల్ల మంచి లాభాలు వస్తాయని వీటిని మనం మహారాష్ట్ర నుండి దిగుమతి చేసుకుంటున్నామని క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగుకు కూడా ఇది మంచి కాలమని బంతి, కనకాంబరం, లిల్లీ పూలకు మంచి డిమాండ్ ఉందని మంచి లాభాలు కూడా వస్తాయని హైబ్రిడ్ సీతాఫలం ద్వారా కూడా మంచి లాభాలు ఉన్నాయని ఈ పంటలకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందని వివరించారు.
అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని ఇప్పటికీ 50 వేల ఎకరాలలో వీటి సాగుకు అనుమతులు మంజూరు చేశారని వీటి సాగు ద్వారా రాష్ట్రంలో నూనెల దిగుబడి తగ్గుతుందని ప్రస్తుతం వేరే రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పంటకు ఎంఎస్‌పి కూడా ఉన్నదని, ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉన్నదని వివరించారు.
సగం భూముల్లో పంట మార్పిడి మిగతా సగంలో దొడ్డు, సన్నరకం వరి మేలు, రైస్ మిల్లర్ల సంఘం కార్యదర్శి మోహన్ రెడ్డి
జిల్లాలో పండిస్తున్న వరిలో సగానికిపైగా ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నామని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన చేయకపోయినా గతంలో చేసిన విస్తీర్ణంలో సగం భూమిలో ఇతర పంటలను సాగుచేస్తూ మిగతా సగంలో సన్నరకం దొడ్డు రకం వరి పంటను సాగు చేయడం ద్వారా వాటిని వ్యాపారులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని ఇందులో కొత్తరకం వరి వంగడాల సాగుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నారు.
చివరగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం యూనిట్‌గా చేసుకొని ఎక్కువగా నీరు వచ్చే చోట వ్యాపారులతో బై బ్యాక్ ఒప్పందం చేసుకొని వరిలో దొడ్డు, సన్నం రకాలను సాగు చేసుకుంటూ మిగతా సగం భూములను ఇతర పంటల సాగుకు వినియోగించుకునే విధంగా ఆలోచించాలని ఆయన రైతులకు సూచించారు.
తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి, కలెక్టర్
కరోనా కొత్త వేరియంట్ సౌత్ ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెంది నిన్న యూ.ఎస్.లో గుర్తించారని మెల్లగా ఇది ఇతర దేశాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. మూడవ విడత ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారని, దీని ప్రభావం నుండి బయటపడాలంటే తప్పనిసరిగా రెండు విడుదల వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని, నిజామాబాదులోని మాలపల్లి, అర్సపల్లి, వినాయక నగర్ తదితర ప్రాంతాలతోపాటు బోధన్‌లోని రాకాసి పేట్, పానగల్లి తదితర ప్రాంతాలలో చాలామంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదని, వీరు లక్షన్నర వరకు ఉన్నారని పలు అనుమానాలతో, భయంతో వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల మూడవ విడత ఒమైక్రాన్ వస్తే మాత్రం ఆ ప్రజలు బయటపడడానికి చాలా ఇబ్బంది పడతారని, ప్రాణాల మీదికి కూడా రావచ్చని పేర్కొన్నారు.
అందువల్ల పుకార్లు నమ్మకుండా తప్పనిసరిగా ఆరోగ్య కార్యకర్తలను కలిసి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేకల గోవిందు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు మంజుల, శాస్త్రవేత్తలు బాలాజీ, మార్క్‌ఫెడ్ డిఎం, విత్తన కార్పొరేషన్ డిఎం, రైతు బంధు సమితి ప్రతినిధులు, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు దయానంద్ గుప్త, షుగర్ కేన్ అసిస్టెంట్ కమిషనర్ రవి, దయానంద్ గుప్త తదితరులు పాల్గొన్నారు.