కామారెడ్డి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అటవీ అధికారులను అడ్డగించిన వారిపై దాడి చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రెవిన్యూ, అటవీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హతలు ఉన్నవారికి చట్టం ప్రకారం హక్కు పత్రాలు వస్తాయని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. సంఘటనలు పునరావృతం కాకుండా పి.డి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముంబాజి పేట శివారులో అటవీ అధికారులపై దాడులు చేసిన ఆరుగురిని గుర్తించినట్లు చెప్పారు. వీరిలో ఐదుగురిని గురువారం పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
సంపంగి లక్ష్మయ్య, నగేష్, లవన్ కుమార్, గుర్రపు చిన్నోళ్ళ గణేష్, హనుమంతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. సంపంగి పోచయ్య పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. త్వరలో ఇతడిని పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో డిఎఫ్‌ఓ నిఖిత మాట్లాడారు. అటవీ అధికారులపై దాడులు చేయడాన్ని ఖండిస్తామని చెప్పారు. జిల్లాలో 22 శాతం అటవీ విస్తీర్ణం ఉందని, దానిని పెంచడానికి అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలని పేర్కొన్నారు.