నిజామాబాద్, డిసెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఎవరైనా అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు అన్నింటి గుర్తించి పది రోజుల్లో బౌండరీలు ఫిక్స్ చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నిజామాబాద్‌లోని ధర్మపురి హిల్స్, అర్సపల్లి, సారంగాపూర్ ప్రాంతాలలో పర్యటించి ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు 12, 13, 14 డివిజన్‌లలో కొందరు కబ్జా చేస్తున్నారని తెలిసి రావడం జరిగిందన్నారు. ఇక్కడ బ్లాస్టింగ్ చేసి లెవెల్ చేయడం, గ్రావెల్ వేసి రోడ్డు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని ఉండటం లాంటివి చూశామని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ చేస్తారని, ఆర్‌డిఓ పది రోజుల్లో అన్ని వివరాలు సేకరించి ప్రతి ప్రభుత్వ స్థలానికి బౌండరీలు ఫిక్స్ చేయాలని, ప్రభుత్వ స్థలం అని బోర్డు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చట్ట వ్యతిరేకంగా నిర్మాణం చేసుకుంటే వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వము 2 బిహెచ్‌కె ఇండ్లు నిర్మిస్తుందని, నిజామాబాద్ అర్బన్‌లో ఇంకా 15 వందల నుండి 2 వేల వరకు 2 బిహెచ్‌కె ఇండ్లకు స్థలము కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని పేదవారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరన్నా అమ్మితే మోసపోవద్దని, వాటిని కొనవద్దు అని సూచించారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే క్షమించరాని నేరం అన్నారు. జరిగిన వాటిపై డీటెయిల్‌గా ఎంక్వయిరీ చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పిడి యాక్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చని, ప్రజలు గమనించాలన్నారు. ఈ ఏరియాలో వ్యాక్సిన్ తక్కువగా ఉందని, వచ్చే పదిరోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేసే విధంగా ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిన్ననే ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ మన దేశంలో ఎంట్రీ అయిందని కర్ణాటకలో రెండు కేసులు వచ్చినవని, ఈ సందర్భంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కనబడుతుందన్నారు.
సెకండ్ వేవ్‌లో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. తెలియక పోవడం, అవగాహన లోపం, అపోహలు, అనుమానం వల్ల వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే వైరస్ మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు, పక్క వారికి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలని అందుకు వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎల్.బి. చిత్రా మిశ్రా, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఆర్‌డిఓ రవి, డివిజన్ కార్పొరేటర్లు తహసిల్దార్‌లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.