నిజామాబాద్, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం తలపెట్టే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన అన్నారు.
శనివారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్ బకాయిలు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోర్సులు పూర్తిచేసి పై చదువులకు వెళ్లే సమయంలో ప్రైవేటు యాజమాన్యాలు, సంస్థలు ఫీజులు పెండిరగులో ఉండడంతో సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదన్నారు.
దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారన్నారు. అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. దీంతో ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చదువులు మానే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని పి.డి.ఎస్.యూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగా సోమవారం వేలాది మంది విద్యార్థులతో ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని విద్యార్థులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.నరేందర్, జిల్లా నాయకులు ప్రత్యూష, అనిల్, నగర నాయకులు సాయితేజ, మహిపాల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.