కామారెడ్డి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలవాలని సూచించారు. దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి స్వయం ఉపాధిలో రాణించాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దివ్యాంగులు విన్నవించిన సమస్యలను పరిశీలించి, పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. అర్హతలు, సామర్థ్యాలు ఉన్న ప్రతి ఒక్కరు తమ లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.
సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు మాట్లాడారు. దివ్యాంగులను ఉపాధి హామీ శ్రమశక్తి సంఘాలలో సభ్యులుగా చేర్పించామని చెప్పారు. దివ్యాంగులకు 150 పని దినాలు ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా బిసి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాస్, అంబాజీ నాయక్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు దుర్గాప్రసాద్, రజిత, పోచవ్వ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.