నిజామాబాద్, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేనందున రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని, ఒకవేళ వరి సాగు చేయవలసి వస్తే వ్యాపారులు, విత్తనాల కంపెనీలతో బై బ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లే విధంగా తెలియజేయాలని, ఒమిక్రాన్ కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ఈ నెల చివరి కల్లా ప్రతి ఒక్కరు రెండు విడతల వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి దూర ప్రాంతాల నుండి శ్రమను, ఖర్చును భరించి వస్తారని, ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను సకాలంలో పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో పంట మార్పిడి, కోవిడ్ వ్యాక్సినేషన్, హరితహారంపై తదితర అంశాలపై మాట్లాడారు. వ్యవసాయ సంబంధిత శాఖలు అన్ని కూడా ప్రభుత్వం క్లియర్గా తెలియజేసినందున ఈ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు, కాబట్టి రైతులు వరి పంట కాకుండా వేరే పంటల వైపు వెళ్లాలని, ఒకవేళ వరి ధాన్యం వేస్తాం అంటే తప్పక వారు మార్కెట్‌కు సంబంధించిన అంశాలు చూసుకోవాలని, ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఇబ్బందులు లేకుండా మంచి దిగుబడి ధరలు వస్తాయో వాటి వైపు వెళ్లే విధంగా రైతులకు వివరించి చెప్పాలన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలన్నారు. ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున మళ్లీ కొత్తగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నవని సంకేతాలు వస్తున్నాయని, ప్రతి ఆఫీసులో పని చేసేవారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలన్నారు. స్కూల్లలో, కాలేజీలలో కోవీడ్ ప్రోటోకాల్ పాటించాలన్నారు. వందకు వందశాతం కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
హరితహారం పై ప్రతి వారం రివ్యూ నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లా అధికారి వారి పరిధిలోని మొక్కలను పరిశీలించాలన్నారు. ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజావాణికి జిల్లా అధికారులు ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరుకావాలని, జిల్లాలోని ఎక్కడెక్కడి నుండో ప్రజావాణికి వస్తారని వారి పిటిషన్‌లను ప్రాపర్ గా ఎంక్వయిరీ చేసి క్లియర్ చేయాలని మీ పరిధిలో లేకుంటే లేవని, ఉంటే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎల్.బి. చిత్రా మిశ్రా, జెడ్‌పి సీఈవో గోవింద్, ఆర్డిఓ రవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.