కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో గత 3 రోజులుగా రిలే దీక్ష చేస్తున్న పీహెచ్‌డి స్కాలర్ గణేష్ దీక్షకు సోమవారం టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు తమ సంఫీుభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు బాలు, నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడుగడుగున అన్యాయమే జరుగుతుందని, నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టానుసారంగా నియామకాలు జరపడం బాధాకరమని, అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గురించి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు.
టిఆర్‌ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు చెప్పిన వారికే ఉద్యోగాలు వస్తున్నాయని, అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే చాలా విభాగాల్లో నియామకాలు చేస్తున్నారని ఒక వైపు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటే,ఉన్న ఉద్యోగాల్లో కూడా అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి టిఆర్‌ఎస్‌ను తరిమికొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థి పోతన, విద్యార్థులు పాల్గొన్నారు.