నిజామాబాద్, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వడ్ల కొనుగోళ్ల పేరుతో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ల యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ యాసంగి వరి పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల పట్ల ప్రజలను చైతన్యం చేసిన తర్వాతే వరి పంట సాగుపై నియంత్రణ చేయాలన్నారు. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టకూడదన్నారు.
ప్రస్తుత వరి కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు దోపిడిని కొనసాగించడం దుర్మార్గమన్నారు. దీనిపై జిల్లా అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టాలన్నారు. రైతులను దోపిడీ చేసిన మిల్లర్‌లపై కేసులు నమోదు చేయాలన్నారు. జాతీయ విద్యుత్ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర చట్టాన్ని శీతాకాల సమావేశాల్లోనే చేయాలన్నారు. కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, రామకృష్ణ, నాయకులు సురేష్, సాయగౌడ్, బాలయ్య, సాయరెడ్డి, ఒడ్డెన్న, నజీర్ తదితరులు పాల్గొన్నారు.