డిచ్‌పల్లి, డిసెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా ఆచార్య కె. శివశంకర్ నియమితులైనారు. అందుకు సంబంధించిన నియామక పత్రాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం ఉదయం వీసీ చాంబర్‌లో అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అప్పటికి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆచార్య ఎం. యాదగిరి వద్ద నుంచి రిజిస్ట్రార్ చార్జ్ స్వీకరించారు.
ఇదివరకు రెండు పర్యాయాలు రిజిస్ట్రార్ బాధ్యతలు స్వీకరించి, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించిన ఆచార్య కె. శివశంకర్‌ను అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థి సంఘ నాయకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
ప్రారంభంలో ఆచార్య కాశీరాం ఉపకులపతిగా ఉన్న సందర్భంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేవలం ఒక భవనంలోనే ఉన్న విశ్వవిద్యాలయాన్ని సువిశాలమైన డిచ్‌పల్లి క్యాంపస్‌కు మార్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. రాళ్లు, గుట్టలు, ముళ్లపొదలు కలిగిన ప్రదేశాన్ని ఒక ఉన్నత విశ్వవిద్యాలయంగా మారుస్తూ ప్రారంభ ఆటంకాలను ఎన్నింటినో అధిగమించారు. ఆనాటి రాజకీయ ప్రతిబంధకాలను సైతం ఓర్చుకుంటూ విశ్వవిద్యాలయాన్ని విజయపథంలో నడిపారు.
మొట్టమొదట క్యాంపస్‌లో పరిమితమైన వనరులను సద్వినియోగం చేసుకుంటూ పరిపాలనా భవనం, కళాశాల భవనం, బాలుర బాలికల హాస్టల్ భవనాలను నిర్మించారు. తదనంతరం దక్షిణ ప్రాంగణం బిక్నూరు, బి.ఎడ్. కళాశాల (గురుకులం) సారంగపూర్‌లను ఏర్పాటు చేశారు. వీరి హయాంలో సాధించిన విద్యా ప్రమాణాల దృష్ట్యా యూనివర్సిటికి యూజీసీ 2 (ఎప్), 12 (బి) గుర్తింపు లభించింది. విద్యార్థుల ఉన్నత విద్యా లక్ష్యానికి, అధ్యాపకుల ప్రమోషన్‌ల సాధనకు, స్వయం సమృద్ధికి ఇతోధిక సాయం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల అఫిలియేషన్స్‌కు అనువైన రంగాన్ని సిద్ధం చేశారు.
మరొకసారి ఉపకులపతి ఆచార్య సాంబయ్య నేతృత్వంలో రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించి, విశ్వవిద్యాలయంలోని వివిధ క్యాంపస్‌ల విస్తృత వికాసం కోసం పాటుపడ్డారు. ఆడిట్ సెల్ డైరెక్టర్, యూజీసీ డీన్, రూసా డైరెక్టర్, కొంతకాలం ఆర్ట్స్ డీన్‌గా, ప్రస్తుతం సోషల్ సైన్స్ డీన్‌గా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా బాధ్యతలను అందించిన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతానని పేర్కొన్నారు.