కామారెడ్డి, డిసెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటలుగా పొద్దుతిరుగుడు, మినుము, శనగ, నువ్వులు, వేరుశెనగ వంటి పంటలు వేసుకోవచ్చని సూచించారు. విత్తన కంపెనీలతో, రైస్ మిల్ యజమానులతో ఒప్పందం చేసుకున్న రైతులు వరి పంటను సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం ఎఫ్‌సిఐ సేకరించడం లేదని చెప్పారు.
యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయదని పేర్కొన్నారు. ఒక ఎకరం వరి పండిరచే నీటితో నాలుగు ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు పండిరచుకోవచ్చునని సూచించారు. రైతులు ఆధునిక పద్ధతులు పాటించి కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద రైతులు కూరగాయల పంటలను సాగు చేసుకోవచ్చని సూచించారు.
గ్రామాల్లోని ఆదర్శ రైతుల సలహాలు, సూచనలు పాటించి ఇతర రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. దోమకొండ, బీబీపేట అవగాహన సదస్సులకు మహిళా రైతులు అధిక సంఖ్యలో హాజరు కావడం అభినందనీయమన్నారు. మహిళా రైతులు ఇతర రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఉద్యానవన శాఖ ద్వారా బిందు, తుంపర్ల సేద్యం కోసం అర్హతగల రైతులు మండల వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచులు అంజలి, లక్ష్మి, ఎంపీపీలు సదానంద, బాలమణి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, దోమకొండ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.