వేల్పూర్, డిసెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 ఐసియి, 6 ఆక్సిజన్ బెడ్‌లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన హాస్పిటల్‌లో కూడా ఐసియు బెడ్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం హాస్పిటల్స్‌ను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఎవ్వరం ఊహించని కరోనా లాంటి వింత వైరస్ మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని, కరోనా మనకు ఎన్నో పాఠాలు కూడా నేర్పిందని చెప్పారు. కరోనా కట్టడికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, వైద్య సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. వారి పని తీరుతో నాకు ఆత్మీయులు అయ్యారని, వారి పనిమీద పూర్తి విశ్వాసం ఏర్పడిరదన్నారు.
రెండో వేవ్‌లో ఏంతో మంది ఆత్మీయుల్ని కోల్పోయామని, ఎంత డబ్బు ఉన్న దగ్గర్‌లో అత్యవసర సౌకర్యాలు లేక వారిని కాపాడుకోలేక పోయామని వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానన్నారు. దేవుడి దయ వల్ల తన కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగానే ఉన్నామని, తనకు కావాల్సింది ప్రజలకు సేవ చేయడమే అని మంత్రి వేముల అన్నారు. ప్రజలకు మంచి చేయాలని తనతో పాటు నడిచేవాళ్ళంతా తన ఆత్మీయులు, కుటుంబ సభ్యులే అన్నారు.
తన మిత్రుల సహకారంతో 1.5 కోట్ల వ్యయంతో బాల్కొండ నియోజకవర్గ హాస్పిటల్స్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని 12 ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇప్పుడు ఐసియు, ఆక్సిజన్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్, వాటర్ ఆర్వో ప్లాంటు అందుబాటులో ఉన్నాయన్నారు. మంత్రి మిత్రులతో పాటు ఆయన సతీమణి నీరజారెడ్డి కూడా 25 లక్షలు హాస్పిటల్స్ అభివృద్ది కోసం ఇచ్చిందని చెప్పారు.
ఇటీవల ఒక మిత్రుడు 27 లక్షల విలువ గల ఆక్సిజన్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చాడని, అది మోర్తాడ్ కేంద్రంగా నియోజకవర్గం అంతా వినియోగంలోకి వచ్చిందన్నారు. తోడ్పాటునందించిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్, డిప్యూటి డిఎంహెచ్‌ఓ డా.రమేష్, వేల్పూర్ పిహెచ్సి డా. అశోక్‌లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజారెడ్డి, ఎంపిపి, జడ్పీటీసీ, డిఎంహెచ్‌ఓ సుదర్శనం, నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్, డిప్యూటి డిఎంహెచ్‌ఓ డా.రమేష్, వేల్పూర్ పిఎచ్‌సి డాక్టర్ అశోక్ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.