నిజామబాద్, డిసెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక, మొరం, కంకర మైనింగ్ మాఫియా చెలరేగిపోతున్నదని, దీనిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ… జిల్లాలో ఇసుక, మొరం, కంకర మైనింగ్ మాఫియా ఆగడాలు శృతిమించినాయన్నారు. క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో కుమ్మక్కై ప్రకృతి సంపదను దోచుకుంటున్నారన్నారు. ఇటీవల వీఆర్‌ఏ హత్యఘటన మాఫియా ఆగడాలకు ఒక నిదర్శనమన్నారు.
జక్రాన్‌పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో గ్రామ చెరువు భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలను, గ్రామానికి చెందిన గుట్టలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్‌ను గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజాప్రతినిధులే చేయిస్తున్నారన్నారు. వీరికి స్థానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులే వత్తాసు పలుకుతున్నారన్నారు. వీరందరిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, మొరం తవ్వకాలను తక్షణమే ఆపివేయించాలని, అక్రమ మైనింగ్ చేసిన వారిపై జరిమానాలు విధించి, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, ప్రజా సంఘాల (ఏఐకెఎంఎస్, ఐఎఫ్‌టియు, పిడిఎస్‌యు) నాయకులు బి.దేవారం, పి.రామకృష్ణ, వెంకన్న, మల్లేష్, రాజేశ్వర్, ఎం.సుధాకర్, సాయగౌడ్, బాబన్న, భాస్కర్, దామోదర్, సాయరెడ్డి, కిరణ్, పాల్గొన్నారు.