ఆర్మూర్, డిసెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్బన్ అటవీ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆమె పలు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. మాక్లూర్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాలలో పర్యటించారు.
మాక్లూర్ అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి అయ్యి ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరు కిలోమీటర్ల పొడవున్న ఫెన్సింగ్ మూడు కిలోమీటర్లు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మూడు కిలో మీటర్లు పూర్తిచేయాలని పార్క్‌లో సంవత్సరం పొడవునా నీళ్లు నిలువ ఉండేవిధంగా ట్యాంకులు నిర్మించాలని సూచించారు.
అందులో చిన్న పూర్ చెరువు నుంచి గానీ, వాటర్ వసతి కోసం బోర్ల ద్వారా, సోలార్ పంపుసెట్ల ద్వారా నీళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారెస్ట్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా దగ్గర దగ్గరగా మొక్కలు నాటించాలని ఫామ్ పాండ్స్ తగ్గించాలని, డెత్ ప్లాంటేషన్ ఉండాలని, ఫినిషింగ్ వెంబడి 5.6 కిలోమీటర్ల పొడవు వాకింగ్ ట్రాక్ వెంబడి మొక్కలు పెట్టించాలని అన్నారు.
కిలోమీటరు పొడవునా వాకింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలన్నారు. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి పల్లె ప్రకృతి వనం సందర్శించారు. పల్లె ప్రకృతి వనం బాగుందని అందులో జమ్మి ఉసిరి, నిమ్మ చెట్లను పెట్టాలని సర్పంచ్‌కి సూచించారు. కార్తీకమాసంలో వనభోజనాలకు వచ్చే విధంగా ఉండాలన్నారు. అనంతరం నర్సరీ, డంపింగ్ యార్డ్ పరిశీలించారు.
ఆర్మూర్ పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రహదారిపై ప్రకృతి వనం బోర్డు ఏర్పాటు చేయాలని, మొక్కలను గ్యాప్ లేకుండా పెట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డిఎఫ్‌వో సునీల్, ఆర్మూర్ రెంజ్ స్టాప్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ జనార్దన్ గౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు.