ఆర్మూర్, డిసెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ తెలిపారు. శిక్షణా తరగతులు ఆర్మూర్ విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన హామీలు నీటిమూటలైనాయని, ఉప ఎన్నికలు వచ్చినపుడల్లా త్వరలో 50వేల ఉద్యోగాలు, త్వరలో 70 వేల ఉద్యోగాలు భర్తీ అంటు ప్రకటనలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని వీళ్ల ప్రకటనలకు ఆచరణకు పొంతన లేక నిరాశ నిస్పృహలకు లొనవుతున్న యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు అప్పగిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని, నిరుద్యోగం, ఆకలి చావులు పెరుగుతున్నాయని ప్రపంచ ప్రామాణికమైన అనేక సూచికలు తెలియజేస్తున్నాయన్నారు. వీటిపై దేశ యువత ఆలోచించకుండా స్పందించకుండా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా మద్యం, డ్రగ్స్ మత్తులో చిత్తు చేస్తున్నారని అన్నారు.
పాలకుల ప్రజా వ్యతిరేక ముఖ్యంగా నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యువతను చైతన్యం చేద్దామని ఆ క్రమంలోనే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌లో ఈ అంశాలపై చర్చించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు రూపొందించి పోరు బాట పడుదామని యువతకు పిలునిస్తూ జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లొ జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆల్గోట్ సాయిలు, నాయకులు నరేశ్, కిశోర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.