నిజామాబాద్, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం టిఎన్జివోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన క్రిష్టమస్ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్చేసి క్రైస్తవులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహిస్తున్నామని దాంట్లో భాగంగా బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లలో జరుపుకున్నామని అదేవిధంగా నేడు టీఎన్జీవో ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్యవర్గ బృందాన్ని జిల్లా యంత్రాంగం పక్షాన అభినందిస్తున్నానని తెలుపుతూ, జిల్లాలో గల ప్రజలందరూ ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకొని ఐక్యతను చాటాలని కోరారు.
జోనల్ విధానం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా యంత్రాంగం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ టీఎన్జీవో సంఘం ఉద్యోగుల పక్షపాతి సంఘమని, ఉద్యోగుల సంక్షేమంతో పాటు వివిధ సేవ కార్యక్రమాలను కులమతాలకు అతీతంగా నిర్వహించి ప్రజలందరి మధ్య ఐక్యతను చాటడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
దాంట్లో భాగంగానే ప్రతీ సంవత్సరం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్, సంగం అమృత్ కుమార్, అన్ని యూనిట్ శాఖల టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్రైస్తవ జిల్లా మతపెద్దలు జాన్సన్, జోసఫ్, ఏఐసిసి జిల్లా అధ్యక్షులు వయ్యా డేవిడ్, జాన్ సామ్యుల్, జాన్సన్, అబ్రహం, వివిధ శాఖల క్రైస్తవులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.