నిజామాబాద్, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండిరగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.
బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను డిస్పోస్ చేసి, తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని అన్నారు. జనవరి 5 నాడు అన్ని గ్రామాలలో తుది ఓటర్ జాబితాను ప్రచురించాలని అధికారులకు ఆదేశించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలోని ఈ.వి.ఎం.లను కొత్త గోడౌన్లకు తరలించాలని, ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, జిల్లా పరిషత్ సీఈవో గోవిందు, ఆర్డివో రవి, తదితరులు పాల్గొన్నారు.