హైదరాబాద్, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై మంత్రి స్పందించారు.
కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని, కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించామని, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమన్వయం సాధించామని, 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశామని, విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకం అని సబిత పేర్కొన్నారు.
620 గురుకులలాను, 172 కస్తూర్బా కళాశాలలకు ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేశామని, ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, టీ శాట్, దూరదర్శన్ వెబ్సైట్ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచామని, నెలరోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించామని, ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, 4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ఇంటర్ ఫస్టియర్‌లో 49శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.
కాగా ఫస్టియర్ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదని, 10వేల మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించారని, ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారన్నారు. ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరమని, పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దని, విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఇంటర్ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్ చేస్తున్నామన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి మార్కులు సాధించాలని, ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్‌లో కూడా పాస్ చేస్తారని ఆశించవద్దు అని మంత్రి సబితా ఇద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.