ఆర్మూర్, డిసెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతిని పురస్కరించుకుని, సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధి మామిడిపల్లిలోని తపస్వితేజో నిలయంలో చిన్నారులతో కార్యక్రమం నిర్వహించారు. వాజపేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి చిన్నారులకు అన్న ప్రసాదము కొరకు, గోవుల కొరకు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
అటల్ బిహారీ వాజపేయి అజాత శత్రువు అని, వాజపేయి ఓ మహర్షి, ఓ యుగద్రష్ట అని వారు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలో పని చేయాలన్న కుతూహలం ప్రతిపక్షాలకు సైతం ఉండేదని, వారి కారణంగానే దేశంలో గ్రామీణ సడక్ యోజన, పనికి ఆహార పథకం, జాతీయ రహదారుల స్వర్ణ చతుర్భుజి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వాజపేయి చేశారని గుర్తుచేశారు.
జై జవాన్ జై కిసాన్‌తో పాటు జై విజ్ఞాన్ అనే నినాదాన్ని వాజ్‌పేయి ఇచ్చారని, ప్రోఖ్రాన్‌లో అణు ప్రయోగం చేసి అణువస్త్రాలే లేకుంటే అన్న వస్త్రాలు సైతం వదులుకోవలసి వస్తుందని బలంగా చెప్పి ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిర్మాణం చేయడానికై, దేశమే ముందు తర్వాతే ఏదైనా అని సంకల్పించి, పక్క దేశాలతో సైతం స్నేహభావాన్ని పెంపొందించిన వ్యక్తి అని వారి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడంలో భాగంగా తపస్వి తేజో నిలయంలో చిన్నారుల మధ్య కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
వాజపేయి యొక్క ఆశయాలను, ఆదర్శాలను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడిచి దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, చెన్న శంకర్, భూపేందర్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శ్యామ్ గౌడ్, బూసం ప్రతాప్, దోండి ప్రకాష్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఖాందేశ్ ప్రశాంత్, పార్టీ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.