ఆర్మూర్, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన నిరుద్యోగ దీక్ష విజయవంతం చేయడానికై వెళ్ళే పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రివేళ అరెస్టు చేసి పోలీసు కార్యాలయానికి తరలించారు.
ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బిజెవైయం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నిధులు, నియామకాలు, నీళ్ల కోసం ఏర్పాటైన రాష్ట్రమని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రెండువేలకు పైగా యువకులు ప్రాణ త్యాగం చేసి సాధించిన తెలంగాణ అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను తమ జేబుల్లోకి, నియామకాలను తమ కుటుంబానికి, నీళ్లను ఎవరికీ కాకుండా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏండ్ల తరబడి ఉద్యోగాలు రాక సుమారు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, ఉద్యోగాలు ఉపాధి కరువై లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు అల్లల్లాడుతున్నా వీరి గురించి పట్టించుకోకపోవడం కెసిఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. దీన్ని నిరసిస్తూ ప్రభుత్వాన్ని గద్దెదించడానికై భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ దీక్షను శాంతియుతంగా, గాంధేయ మార్గంలో చేపడితే అడ్డుకోవడం, ఎక్కడికక్కడ పోలీసులచే బిజెపి నాయకులను, కార్యకర్తలను, నిరుద్యోగయువకులను అరెస్టు చేయించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
రాబోయే కాలంలో తెలంగాణ నుండి టిఆర్‌ఎస్ పార్టీని తరిమేవరకు ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఉదయ్ గౌడ్, పసుపుల సాయికుమార్, ఉపాధ్యక్షులు పెరంబదూర్ వాసు, భత్తుల శ్రీకాంత్, కంఠం అక్షయ్ తదితరులున్నారు.