నిజామాబాద్, డిసెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్ 317 వెనక్కి తీసుకోవాలని మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు దేవిసింగ్, వెనిగళ్ల సురేష్, సల్ల సత్యనారాయణ తదితరులను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు.
అక్రమ అరెస్టులను పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, ఐ.ఎఫ్.టీ.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన పీ.వో.డబ్ల్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి. గోదావరి, కే.సంధ్యారాణి, పీవైఎల్ జిల్లా నాయకుడు మారుతి ఖండిరచారు. ప్రభుత్వం ఉద్యోగ బదిలీల విషయంలో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నదన్నారు. కనీసం ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదన్నారు. జీవో నెంబర్ 317 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.