గాంధారి, డిసెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు.
పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానంలో ఆర్చరీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ కోర్టులను ఏర్పాటు చేయాలనీ ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విదంగా తీర్చిదిద్దాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్బంగా ఏకలవ్య పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు.
పాఠశాల దత్తత తీసుకున్నందున దశలవారీగా సందర్శిస్తానని అన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడమే కాకుండా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మంచిగా చదువుకొని మీరు చదువుకున్న పాఠశాలకు పేరు తేవాలని అన్నారు.
చదువుతో సమానంగా క్రీడలలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజేతలుగా నిలువాలని అన్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అమర్ సింగ్, స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్, తహసీల్దార్ గోవర్ధన్, అధికారులు తదితరులు ఉన్నారు.