నిజామాబాద్, డిసెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గా బోదాస్ రాజలింగంకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ చేతుల మీదుగా గురువారం నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా బోదాసు రాజలింగం మాట్లాడుతూ బాల్కొండ మండలంలోని బీసీ కులాల కోసం పోరాడుతానని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో అట్టడుగున ఉన్న బిసి వర్గాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్ నుంచి తనను బాల్కొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన డాక్టర్ బొబ్బిలి నరసయ్యకి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బీసీ రైతులకు, మహిళలకు, యువతకు అవసరమైన సహాయ సహకారాలు ఉంటాయని, బీసీ సంక్షేమ సంఘం తరపున తాను ఎల్లవేళలా పోరాడుతానని అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న బిసిలకు కుల వృత్తిపై ఆధారపడి నివసిస్తున్న బిసిలకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల ఆధారిత జనగణన జరిపించాలని, హుజురాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు ప్రకటించినట్టుగా వెంటనే బిసి బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మదండి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బూస మహేష్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం బాల్కొండ మండల అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.